జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మత్తు ప్రభావం కలిగించే ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
మెడికల్ ఏజెన్సీలపై తనిఖీలు
నాలుగు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హైస్కూల్ సమీపంలో వాడేసిన ట్రామడాల్ సిరంజీలను స్థానికులు గుర్తించి డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు పట్టణంలోని మెడికల్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో ట్రామడాల్ అక్రమ అమ్మకాలను గుర్తించి, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లైసెన్సును దుర్వినియోగం చేసి..
దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన కాండ్రేగుల లక్ష్మణ సాయి కిషోర్ (28) ను అరెస్టు చేశారు. నిందితుడు శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తూ, తన లైసెన్సును దుర్వినియోగం చేసి కంపెనీల నుంచి సుమారు 20 వేల ట్రామడాల్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసినట్లు తేలింది. అందులో 12,450 ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి బిల్లులు లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అక్రమంగా విక్రయించారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ. 5 చొప్పున కొనుగోలు చేసి, రూ. 20 నుంచి రూ. 50 వరకు అధిక ధరలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇంజెక్షన్ల వివరాలపై నిందితుడు ఇచ్చిన సమాచారంతో, డాంగేనగర్‌లోని ఓ వుడ్ కార్వింగ్ వర్క్‌షాప్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోదాలు నిర్వహించారు. అక్కడ నాలుగు కార్టన్ బాక్సుల్లో రహస్యంగా దాచిన 7,550 ట్రామడాల్ ఇంజెక్షన్ అంప్యూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్‌లు, మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఇంజెక్షన్లను స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులు, ఇతర వ్యక్తులకు కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోందని, ఈ నెట్‌వర్క్‌లో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మత్తు కలిగించే ఔషధాలను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సైలు ఎన్‌వీ ప్రసాద్, కుటుంబరావు, వల్లి పద్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడి అరెస్టు


