పెనుగొండ: గణేష్ నిమజ్జన ఉత్సవాలకు డీజే సౌండ్ సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని పెనుగొండ ఎస్సై కే.గంగాధరరావు స్పష్టం చేశారు. ఆదివారం పెనుగొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. డీజే శబ్దాల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని, అందువల్లనే డీజేలకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు అనుమతులు పొందేందుకు డీజీపీ సూచనల మేరకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్, అగ్నిమాపక, గ్రామ పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల నుంచి అనుమతులు వేర్వేరుగా తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అనుమతులు పొందేలా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత శాఖల బృందం మండప ప్రాంతాన్ని పరిశీలించి, క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ ఎన్‌ఓసీ మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మండపాలను రహదారులపై రాకపోకలకు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, అగ్నిప్రమాదాల నివారణకు ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు వంటి రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


