ఉండి: చెరుకువాడ రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం నడుస్తున్న రైలు నుంచి ప్రయాణికుడు కిందికి దూకేయడంతో కలకలం రేగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బట్టలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న అశ్విన్ బూయ్, అతని తమ్ముడు అశోక్ బూయ్ ఒరిస్సాలోని సొంతూరు ఇచ్ఛాపూర్ వెళ్లేందుకు సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. గత కొన్ని రోజులుగా అశ్విన్ మానసిక స్థితి సరిగా లేదు. ప్రయాణంలో భాగంగా అశ్విన్ వాష్‌రూంకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు అశోక్ వెళ్లి చూడగా, అశ్విన్ బోగీ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. లోపలికి రావాలని పిలిచినా వినకుండా తాను చనిపోతానని చెప్పి చెరుకువాడ పరిధిలో రైలు నుంచి కిందికి దూకేశాడు. తమ్ముడు వెంటనే ట్రైన్ చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. సిబ్బంది సాయంతో అశ్విన్‌ను తిరిగి రైలులోకి ఎక్కించి చెరుకువాడ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 108 అంబులెన్స్ ద్వారా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అశ్విన్‌కు తల, ముఖంపై తీవ్ర గాయాలై దవడ ఎముక విరిగింది. అశోక్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని వైద్యం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రైటర్ చక్రవర్తి చెప్పారు.


