కూటమి ఒం‘టెట్టు’ పోకడ | - | Sakshi
Sakshi News home page

కూటమి ఒం‘టెట్టు’ పోకడ

Sep 6 2026 12:55 AM | Updated on Sep 6 2026 12:55 AM

స్పెషల్‌ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత ఏమీ లేదు

బోధిస్తున్న సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలి

నూజివీడు: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు స్పెషల్‌ టెట్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న విడుదల చేసిన నోటిఫికేషన్‌పై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. గతంలో నిర్వహించిన సాధారణ టెట్‌ పరీక్ష మాదిరిగానే స్పెషల్‌ టెట్‌ కూడా ఉండటంతో, ఉపాధ్యాయుల డిమాండ్లలో కనీసం ఒక్కదానికీ మినహాయింపు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలేవీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని వాపోతున్నారు. గతంలో నిర్వహించిన టెట్‌కు దీనికి తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన అంశాలేవీ లేకుండానే స్పెషల్‌ టెట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఎలాగని నిలదీస్తున్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్‌ రాయాలంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండానే..

ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌కు, గతంలో ఉపాధ్యాయులు రాసిన సాధారణ టెట్‌ నోటిఫికేషన్‌కు ఎలాంటి తేడా లేదు. ఉపాధ్యాయ సంఘాలు కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టి, తను అనుకున్నదే జరగాలన్నట్లుగా నోటిఫికేషన్‌ జారీ చేయడం దారుణమని వాపోతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే

● టెట్‌లో 150 మార్కులకు గాను ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు వస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్‌లో క్వాలిఫై కావడానికి అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు 150 మార్కులకు 40 శాతం (60 మార్కులు)గా ప్రకటించాలి.

● స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం ఉపాధ్యాయుడు కూడా టెట్‌లో బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వస్తోంది. పదో తరగతితోనే బయాలజీ చదవడం మానేసిన వారు, ఇప్పుడు బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఎలాగని ఉపాధ్యాయులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టును, ఏ తరగతులకు బోధిస్తున్నారో దానిని పరిగణనలోకి తీసుకుని టెట్‌ నిర్వహించాలి. పేపర్‌–2 సిలబస్‌ 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల ఆధారంగా ఉండటంతో పాటు, కాఠిన్యత ఇంటర్మీడియెట్‌ స్థాయి వరకు ఉంటుందని ప్రస్తుత నోటిఫికేషన్‌లో పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు కంప్యూటర్‌ను ఉపయోగించే సామర్థ్యం తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలి.

● 2010కి ముందు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరిన వారికి టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.

● తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసినట్లుగా, ఏపీ ప్రభుత్వం కూడా 2010 ఆగస్టు 28వ తేదీకి ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్‌ నుంచి పూర్తి, శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరాలి. దీనికోసం ఆర్‌టీఈ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలి.

ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల కొరకు వెలువడిన టెట్‌ స్పెషల్‌ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత ఏమీ లేదు. ఉపాధ్యాయుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లు నిర్ణయించాలి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.

– బత్తుల అనురాధ, యూటీఎఫ్‌ ఏలూరు జిల్లా కార్యదర్శి, నూజివీడు

పిల్లలకు ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు అయితే బోధిస్తున్నాడో, అదే సబ్జెక్టులో టెట్‌ పరీక్ష నిర్వహించాలి. సోషల్‌ బోధించే ఉపాధ్యాయులకు గణితం ప్రశ్నలు ఇచ్చి పరీక్ష రాయమంటే ఎలా రాస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనివల్ల టెట్‌లో అర్హత సాధించడం కష్టసాధ్యమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించి తగిన సవరణలు చేయాలి.

– మల్లెల చెన్నకేశవరావు, ఉపాధ్యాయుడు, నూజివీడు

స్పెషల్‌ టెట్‌తో ఒరిగిందేమీ లేదు

సాధారణ టెట్‌కు దీనికీ తేడా లేదు

ఉపాధ్యాయుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం

ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ పథం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement