గురువులు దైవంతో సమానం | - | Sakshi
Sakshi News home page

గురువులు దైవంతో సమానం

Sep 6 2026 12:55 AM | Updated on Sep 6 2026 12:55 AM

గురువులు దైవంతో సమానం కాలువలో పాలకొల్లు వాసి మృతదేహం లభ్యం కృష్ణా తూర్పు కాలువలో యువకుడి ఆత్మహత్య కాలువలో పడి యువకుడి మృతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గురువులు దైవంతో సమానమని జిల్లా కలెక్టర్‌ కే. వెట్రిసెల్వి అన్నారు. గురుపూజా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి కలెక్టర్‌ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయులని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత సరైన మార్గంలో నడిపించేది గురువేనని ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమిషనరు ఆర్‌.ఆశ, ఉప విద్యాశాఖ అధికారులు పీఎస్‌ సుధాకర్‌, ఎన్‌.రవీంద్ర భారతి, జిల్లా పరిషత్తు, విద్యాశాఖ అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: మొగల్తూరు పరిధిలోని కొత్తాట గ్రామంలో ఉప్పుటేరులో ఉన్న ఒక మృతదేహాన్ని శనివారం ఎస్సై జయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు ఒడ్డుకు చేర్చారు. జిల్లాలో నమోదైన మిస్సింగ్‌ కేసుల ఆధారంగా ఆరా తీయగా, పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసుతో ఇది సరిపోలింది. మృతుడిని పాలకొల్లుకు చెందిన కుచ్చర్లపాటి వేణురాజు (53)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పాలకొల్లు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెదపాడు : కృష్ణా తూర్పు కాలువలో వసంతవాడ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం... నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని, బ్లూ కలర్‌ ప్యాంట్‌, సిమెంట్‌ కలర్‌ ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌ ధరించి ఉన్నారని తెలిపారు. ఆ వ్యక్తి మృతి చెంది సుమారు వారం రోజులు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పెదపాడు హెడ్‌ కానిస్టేబుల్‌ పుల్లయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94407 96637 నంబరులో పోలీసులను సంప్రదించాలని కోరారు.

పెదపాడు: ఏపూరులో కొత్తూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు ఏఎస్సై గజపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తూరుకు చెందిన కడిమి నాగరాజు మృతి చెందిన తర్వాత, అతని భార్య వెంకటరమణ అత్తాకోడళ్ల కలహాల కారణంగా కలపర్రులో నివాసం ఉంటోంది. వారి రెండో కుమారుడు రాజేష్‌ మాత్రం నాయనమ్మ వద్దే ఉంటున్నాడు. శనివారం ఉదయం 5:45 సమయంలో రాజేష్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): గణపవరం మండలం కాశిపాడు గ్రామం వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి మృతి చెందాడు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి, సిబ్బంది శనివారం వివరాలను వెల్లడించారు. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ఊదరపల్లి రాజేష్‌ కుమార్‌ (25) అనే యువకుడు ఈ నెల 4వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో కాశిపాడు గ్రామం వద్ద కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటర్‌ టెండర్‌, రెస్క్యూ బోటుతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం 6 గంటల నుంచి తిరిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో పిప్పర సమీపంలోని కోమటిపాలెం గ్రామం వద్ద సాయంత్రం 5 గంటల సమయంలో రాజేష్‌ మృతదేహం లభ్యమైనట్లు ఫైర్‌ సిబ్బంది తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసి, పోలీసుల సమక్షంలో బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement