చింతలపూడి: చింతలపూడి ప్రాంతంలో రిలయన్స్ సంస్థ చేపట్టనున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టుకు స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతాంగం తెగేసి చెబుతోంది. శనివారం శెట్టివారిగూడెం, వెంకటాపురం సమీపంలోని భూములను పరిశీలించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తమ పొలాల్లోకి ఎలా వస్తారని నిలదీస్తూ, తమ భూముల జోలికి రావద్దని తహసీల్దారుకు స్పష్టం చేశారు.
గ్యాసిఫికేషన్ ప్రక్రియతో ప్రమాదం
ఈ గ్యాసిఫికేషన్ ప్రక్రియ వల్ల భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమవుతాయని, భూమి నిస్సారమై గాలి, నీరు కలుషితమవుతాయని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో భూమి కుంగిపోవడం, విషవాయువులు వెలువడటం జరిగి ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఎకరం ధర రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పలుకుతోంది. ఒకవేళ ప్రాజెక్టు చేపడితే ప్రభుత్వం మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాలని, భూసేకరణ నిబంధనలు, నష్టపరిహార ప్యాకేజీపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
శెట్టివారిగూడెం, వెంకటాపురంలో
రెవెన్యూ అధికారుల రాకపై ఆగ్రహం


