తణుకు అర్బన్: భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవూరు ఇరగవరం రోడ్డు కాలనీలో నివసిస్తున్న పులసేరి భవానీపై భర్త దుర్గాప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించగా ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. 11 ఏళ్ల క్రితం వివాహం అయిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పదేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్న దుర్గాప్రసాద్ ఏడాదికోసారి స్వదేశమైన తణుకు వస్తుంటారు. భవానీ స్థానికంగా ఒక హోటల్‌లో క్యాషియర్‌గా పని చేస్తుండగా ఆమైపె అనుమానం పెంచుకున్న దుర్గాప్రసాద్ ఇటీవల తణుకు వచ్చిన రోజు నుంచి ఘర్షణ పడుతున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ జేవీ రమణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తణుకు పట్టణ ఎస్‌ఐ సీహెచ్‌వీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై కత్తితో దాడి


