● 20 రోజులుగా కనీస అవసరాలకూ కష్టాలే
● పట్టించుకోని ఆర్‌జీయూకేటీ యాజమాన్యం
నూజివీడు: ప్రతిష్టాత్మక నూజివీడు ట్రిపుల్‌ఐటీ (ఆర్‌జీయూకేటీ)లో గత 20 రోజులుగా తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. వేలాది మంది విద్యార్థులు స్నానాలు, పారిశుధ్య అవసరాలకు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యాంపస్‌లో 20 బోర్లు ఉండటంతో పాటు కృష్ణాజలాల సరఫరా ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని విమర్శిస్తున్నారు.
సరిపోని సరఫరా సమయం
క్యాంపస్‌లో మొత్తం 8,800 మంది విద్యార్థులు (65 శాతం బాలికలు, 35 శాతం బాలురు) చదువుతున్నారు. సాధారణ రోజుల్లో ఉదయం రెండు గంటలు (6:00 నుంచి 8:00), సాయంత్రం రెండు గంటలు (6:00 నుంచి 8:00) మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఉదయం 5 గంటలకే లేచి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.
సెలవు రోజుల్లో మరింత ఘోరం
సెలవు రోజుల్లో ఈ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని ఇస్తుండటంతో దుస్తులు ఉతుక్కోవడం, స్నానాలు చేయడం కూడా సాధ్యపడటం లేదని అంటున్న్నారు.
350 మందికి 1,600 లీటర్లే
నీటి కొరత వల్ల బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఒక్కో ఫ్లోర్‌లో 350 నుంచి 400 మంది విద్యార్థులకు గాను 8 డ్రమ్ముల్లో కేవలం 1,600 లీటర్ల నీటిని మాత్రమే నింపుతున్నారు. అంటే ఒక్కొక్కరికి కనీసం 4 లీటర్ల నీరు కూడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేక, పారిశుధ్య లోపంతో తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
వేలాది మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ మౌలిక వసతి సమస్యపై ఆర్‌జీయూకేటీ యా జమాన్యం తక్షణమే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నీటి నిల్వ, సరఫరా వ్యవస్థలను సమీక్షించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


