ద్వారకాతిరుమల : ఎస్బీఐ ఫైనాన్స్ పేరుతో వచ్చిన ఫేక్ కాల్‌ను నమ్మిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్‌కు చెందిన గాంచి కిషోర్‌కుమార్‌కు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫేక్ కాల్ వచ్చింది. రూ.50 వేల లోను మంజూరైందని నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం ముందు రూ.650 పంపాలని, ఆ తరువాత రూ.2,975 చెల్లిస్తే రుణం విడుదల అవుతుందని చెప్పారు. ప్రాసెసింగ్ నిమిత్తం మీరు ముందుగా చెల్లించిన సొమ్ము కూడా లోన్‌తో కలిపి తిరిగి ఇస్తామని నమ్మించారు. దీంతో కిషోర్‌కుమార్ తొలుత రూ.650, ఆపై కొంత అప్పు చేసి రూ.2,975 లను రెండు దఫాలుగా వారు పంపిన స్కానర్‌కు చెల్లించాడు. కొద్దిసేపటికి రూ.50,520 లోన్ మంజూరైనట్టు బాధితుడి ఫోన్‌కు ఫేక్ మెసేజ్ వచ్చింది. అయితే నగదు విడుదల కావాలంటే జీఎస్టీ నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని వారు సూచించారు. దీంతో అనుమానం వచ్చిన కిషోర్‌కుమార్ భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి ద్వారకాతిరుమల స్టేషన్‌కు బదిలీ చేశారు.
తణుకు అర్బన్: తణుకు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక తల్లి ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన బోనగిరి సత్యనారాయణ మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో నిందితుడిపై ఫోక్సో కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
దెందులూరు : మండలంలోని గోపన్నపాలెం గ్రామంలో శుక్రవారం టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మోటార్‌సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెదవేగి మండలం సూర్యరావుపేట గ్రామానికి చెందిన కాసులు (53)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరి న్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అత్తిలి: అతిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి రికవరీ చేసినట్టు ఎస్సై కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు శుక్రవారం అందజేశారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఐఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని కోరారు. ఐఎంఈఐ నంబర్ వంటి వివరాలను భద్రపరచుకోవడం ద్వారా ఫోన్ రికవరీకి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు అనధికారికంగా, సరైన బిల్లులు, వివరాలు లేకుండా విక్రయించే మొబైల్ ఫోన్లను కొ నుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మండలంలోని లక్కవరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోసన తిరుమలరెడ్డి (27) తాను నివాసం ఉంటున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య రాఖీ పండుగ నిమిత్తం పుట్టిల్లు కాకినాడ వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భార్యకు సమాచారం అందించారు. విషయం తెలిసిన లక్కవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


