● శ్రీవారి క్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు
● నేడు ఉట్ల పండుగ
ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. గోపాలుడైన శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు ఆధ్యాత్మికానందాన్ని పొందారు. కొండపై ఉన్న గోసంరక్షణశాలలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని సుందరంగా అలంకరించారు. ఈ దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులం భక్తజన సందోహంతో కళకళలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవులను భక్తిశ్రద్ధలతో పూజించి, వాటికి దాణా అందించారు. పురోహితులు గోపాలకృష్ణునికి విశేష పూజాధికాలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. గోవులను సేవించడం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందవచ్చన్న విశ్వాసంతో భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విశేష పూజలు
సాయంత్రం ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగాయి. అర్చకులు పాలవెల్లిని ఏర్పాటు చేసి, శ్రీకృష్ణుడి జన్మాష్టమి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాలకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వెన్నతో పాటు 12 రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు శనివారం నుంచి యథావిధిగా జరుగుతాయని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
నేడు ఉట్ల పండుగ
జన్మాష్టమి మరుసటి రోజు ఉట్ల పండుగ నిర్వహించడం క్షేత్రంలో ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్ల పండుగను వైభవంగా నిర్వహించనున్నారు. ఉభయ దేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు అశేషంగా తరలిరావాలని ఈఓ కోరారు.


