భార్యపై అలిగి భర్త..
ముదినేపల్లి రూరల్: పనుల్లో సాయం చేయమని అడిగిన భార్యపై అలిగిన భర్త అదృశ్యమయ్యాడంటూ కుమారుడు స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం మండలంలోని పెనుమల్లి శివారు సింగారానికి చెందిన మొవ్వ బాబురావును భార్య గొడ్లపాక శుభ్రం చేయమని కోరింది. దీనిపై ఆగ్రహించిన బాబురావు ఆమైపె కోప్పడగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన బాబురావు రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోగా.. బంధువుల ఇళ్ల వద్ద పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో కుమారుడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
భర్త కనిపించడం లేదని..
తన భర్త అదృశ్యమయ్యాడంటూ భార్య స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వణుదుర్రు శివారు కొత్తపల్లికి చెందిన చెన్నూరు దుర్గాభవానీ, దుర్గారావుకు ఐదేళ్ల క్రిందట వివాహం జరిగింది. వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతో దుర్గాభవానీ పుట్టింటికి వెళ్లింది. అనంతరం పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చగా కొత్తపల్లిలో కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దుర్గారావు మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం లేచి చూడగా భర్త కనిపించకపోవడంతో పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు.


