రెండు మెడికల్ ఏజెన్సీల్లో సోదాలు
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి దొంగచాటుగా మత్తు ఇంజక్షన్లు తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీల గుట్టురట్టయ్యింది. వేగవరం హైస్కూల్ సమీపంలోని ఆయిల్‌పామ్ తోటలో లభ్యమైన మత్తు ఇంజక్షన్లు, సిరంజీల వ్యవహారంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ చేపట్టారు. విద్యార్థులు, యువకులు మత్తుకు బానిసై ఈ ఇంజక్షన్లను వాడుతూ, ఖాళీ వైల్స్ (మందు సీసాలు), సూదులను తోటలో విసిరేస్తున్నారని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈగిల్ టీమ్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టింగ్ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. తోటలో లభ్యమైన ఖాళీ వైల్స్‌ను పరిశీలించి, బ్యాచ్ నంబర్ల ఆధారంగా జంగారెడ్డిగూడెంలోని రెండు ప్రధాన మెడికల్ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు.
రికార్డులు లేని విక్రయాలు : జంగారెడ్డిగూడెంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ యజమాని కిషోర్ హైదరాబాద్ నుంచి గత రెండు నెలల్లో ఏకంగా రూ.5 లక్షల విలువైన 20,000 ట్రామడాక్స్ వైల్స్‌ను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి స్టాక్ లేదా విక్రయ బిల్లులు చూపించలేదు. రికార్డులు లేకుండా వీటిని బ్లాక్‌లో విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే డి.రూప పెద్దింటి మెడికల్ ఏజెన్సీస్ యజమాని ప్రసాద్ అహ్మదాబాద్ నుంచి కొనుగోలు చేసిన 5,000 వైల్స్‌లో (విలువ రూ.95 వేలు) 3,800 వైల్స్‌ను తెలంగాణలోని కన్నాయిగూడేనికి చెందిన రిష్వంత్ మెడికల్స్‌కు విక్రయించారు. సదరు షాపు వ్యక్తి ఇక్కడికి వచ్చి మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేస్తూ, రికార్డులు లేకుండా స్థానిక విద్యార్థులకు, యువతకు అక్రమంగా విక్రయిస్తున్నట్టు ప్రాథమిక విచా రణలో తేలిందని మల్లికార్జునరావు తెలిపారు.
ప్రాణాలకే ప్రమాదం
ట్రామడాల్ అనేది తీవ్రమైన నొప్పుల నివారణకు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడే మందని, దీనిని మత్తు కోసం వాడితే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ ఏజెన్సీలపై లైసెన్సు రద్దు, క్రిమినల్ చర్యల కోసం సహాయ సంచాలకుడు (ఏడీ)కి నివేదిక పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ సరిహద్దు షాపుల లింకులపై అక్కడి డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.


