వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
లింగపాలెం: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. విగ్రహ దాత వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భీమిరెడ్డి వెంకట సూరారెడ్డి (బీవీఎస్ రెడ్డి)ని ప్రత్యేకంగా అభినందించారు. జెడ్పీటీసీ వడ్డాని హరినాథ్‌రాజు, ఎంపీటీసీ వడ్డాని లలిత ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నా రు. తండ్రి బాటలోనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మో హన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని, మరలా జగన్ ను సీఎం చేసేందుకు కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అన్నారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్ల అంజిరెడ్డి, లింగపాలెం, చింతలపూడి మండలాల పార్టీ అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, రమేష్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి చిలుకూరి జానారెడ్డి, గ్రామ అధ్యక్షుడు కొల్లి వీరభద్రరావు, నాయకులు పాల్గొన్నారు.


