ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు బుధవారం కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల, పెండింగ్‌లో ఉన్న ఐదే డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 8 వరకు ప్రతి ఉద్యోగి హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలనూ సందర్శించి కరపత్రా లు పంపిణీ చేయడంతో పాటు ఉద్యోగులు ఎందు కు ఉద్యమం చేయాల్సి వస్తుందో తెలియజేస్తామన్నారు. ఉద్యోగులు వాట్సాప్ డీపీలో ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అని రాసిన ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని నిరసన కొనసాగించారు. ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజ్, జిల్లా సహకార శాఖ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎ.ప్రమోద్‌కుమార్, ఏపీజేఏసీ అమరా వతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


