శ్రీవారి క్షేత్రంలో.. కన్నయ్య గోకులం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంలో.. కన్నయ్య గోకులం

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

శ్రీవారి క్షేత్రంలో.. కన్నయ్య గోకులం

గో క్షీరంతో స్వామికి నైవేద్యం

రేపు కృష్ణాష్టమి

గోసేవే.. శ్రీవారి సేవ

ద్వారకాతిరుమల: బృందావనంలో కృష్ణుడి చుట్టూ గోవులు.. ద్వారకాతిరుమలలో చినవెంకన్న సన్నిధిలోనూ గోవుల సందడి. అక్కడ కృష్ణుడికి గోమాతలతో అనుబంధం.. ఇక్కడ శ్రీవారి సేవలో గోవుల పాత్ర. గోమాతను దేవతగా కొలిచే హిందూ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణశాల నిలుస్తోంది. కొండపై తొమ్మిది షెడ్లలో 358 గోవులను ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో సంరక్షిస్తున్నారు. వాటి నుంచి లభించే పాలు కేవలం పానీయంగా కాకుండా.. స్వామివారి సేవలో పవిత్ర ద్రవ్యంగా మారుతున్నాయి. అభిషేకాల నుంచి నైవేద్యాల తయారీ వరకు వినియోగిస్తున్నారు. భక్తులకు, చిన్నారులకు సైతం పాలు, మజ్జిగగా అందిస్తున్నారు.

గోవులే ఇక్కడ సేవకులు

1984లో ప్రారంభమైన గోసంరక్షణశాల కాలక్రమంలో విస్తరించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన గోవులకు ఇక్కడ సురక్షితమైన వాతావరణం కల్పిస్తున్నారు. పరిశుభ్రమైన షెడ్లు, పౌష్టికాహారం, పశువైద్య సేవలు, ప్రత్యేక సంరక్షణతో గోవులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం 10 రకాల జాతులకు చెందిన 358 గోవులు గోశాలలో ఉన్నాయి.

భక్తుల సహకారంతో..

గోవుల సంరక్షణకు భక్తులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. గోసంరక్షణశాలకు ఇప్పటివరకు భక్తులు అందించిన సుమారు రూ. 7.91 కోట్లు శాశ్వత విరాళాలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దాని ద్వారా ఏడాదికి వస్తున్న దాదాపు రూ. 49.54 లక్షలతో గోపోషణ నిర్వహిస్తున్నారు. గోవుల మేత కోసం దేవస్థానం ప్రత్యేకంగా 20 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతోంది.

రెండు సప్తగోకులాల్లో..

శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలో, అలాగే ఇటీవల కొండపైన వకుళమాత నిత్యాన్నదాన భవనం సమీపంలో నిర్మించిన బృందావనంలో ఏర్పాటు చేసిన సప్త గోకులాల్లో నిత్యం గోపూజలు నిర్వహిస్తున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు స్వామి దర్శనానంతరం గోపూజలు జరుపుకుంటున్నారు.

రైతులకు దత్తతగా..

గోవులను గోసంరక్షణశాలలో మాత్రమే కాకుండా రైతుల జీవనోపాధికి ఉపయోగపడేలా చేయాలన్న ఉద్దేశంతో దేవస్థానం 2013లో గో దత్తత పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు 7,198 గోవులను దత్తతగా అందించారు. రైతులు వీటిని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. దత్తత ఇచ్చిన గోవుల పరిస్థితిని తెలుసుకునేందుకు దేవస్థాన అధికారులు ఏడాదిలో రెండు, మూడు సార్లు రైతుల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు.

గోమాతల నుంచి రోజుకి 120 లీటర్ల పాలు వస్తున్నాయి. ఇందులో 31 లీటర్ల పాలు శ్రీవారి ఆలయంలో స్వామివారి మహా నివేదనకు, 15 లీటర్ల పాలు క్షేత్రానికి వచ్చే 5 ఏళ్ల లోపు పిల్లల ఆకలి తీర్చేందుకు, 20 లీటర్ల పాలు ఆగమ పాఠశాలలో విద్యార్థులకు, 15 లీటర్ల పాలు ఉప, దత్తత ఆలయాల్లో దేవతామూర్తుల అభిషేకాలకు, 20 లీటర్ల పాలు నిత్యాన్నదానానికి, 10 లీటర్ల పాలు విక్రయానికి, మిగిలిన పాలు భక్తులకు మజ్జిగ అందించేందుకు వినియోగిస్తున్నారు.

శ్రీవారి సేవలో గోమాతలు

10 రకాల జాతులకు చెందిన 358 గోవుల సంరక్షణ

నిత్యం 120 లీటర్ల స్వచ్ఛమైన పాలు

అభిషేకాలు, నైవేద్యాలకు వినియోగం.. భక్తులకు పాలు, మజ్జిగ వీటితోనే

రేపు శ్రీవారి క్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు.. 5న ఉట్లు పండుగ

కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీవారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో భాగంగా నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో పాలవెల్లి కట్టి, శ్రీకృష్ణుడి జన్మోత్సవ పూజలను నిర్వహిస్తారు. అనంతరం వెన్నతో కలిపి 12 రకాల పిండి వంటలను స్వామివారికి నివేదిస్తారు. మరుసటి రోజు శనివారం సాయంత్రం క్షేత్రంలో ఉట్లు వేడుకను, శ్రీవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

గోసంరక్షణకు దేవస్థానం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గోశాల అభివృద్ధితో పాటు గోవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గోవుల నుంచి లభించే పాలతోనే ప్రధాన ఆలయంతో పాటు ఉప, దత్తత ఆలయాల్లో దేవతామూర్తులకు అభిషేకాలు, సేవలు నిర్వహిస్తున్నాం. గోపాలు తల్లిపాలతో సమానమనే భావనతో శ్రీవారి దర్శనానికి వచ్చే చిన్నారులకు పాలు అందిస్తున్నాం.

– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement