అత్తిలి బస్‌స్టేషన్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం అత్తిలి నుంచి తన స్వగ్రామమైన పైడిపర్రు వెళ్లడానికి అనపర్తి కాంతమ్మ అనే వృద్ధురాలు తణుకు రోడ్డు కూడలిలో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో భీమవరం నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బస్‌స్టేషన్ నుంచి తణుకు రోడ్డు వైపు మలుపు తిరుగుతుండగా.. కాంతమ్మ ఆ బస్సు ఎక్కేందుకు ఒక్కసారిగా బస్సు ముందు భాగానికి వచ్చారు. అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ గమనించలేకపోవడంతో ఆమె బస్సు ముందు చక్రాల కింద పడి, రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి ఆమెను ఏలూరు ఆసుపత్రికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దెందులూరు: దెందులూరు గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య (31) ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు ఎస్సై బి.వెంకట్‌కుమార్ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుల వాయిదాలు చెల్లించలేక ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడని పోలీసులు వివరించారు. మృతుడు తిరుపతయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆగిరిపల్లికి చెందిన షేక్ ఫిరోజ్ బాషా (46) మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం విజయవాడ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉంచిన జేసీబీని ఫిరోజ్ బాషా తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవడంతో, బంధువులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుపై కుటుంబ సభ్యుల ఆందోళన
నూజివీడు : మండలంలోని సీతారామపురానికి చెందిన 18 ఏళ్ల యువతి బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో నూజివీడు–హనుమాన్‌జంక్షన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎస్సై జ్యోతీబసు, ఏఎస్సై తావిరియా నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని, రహదారిపై ఉన్న మృతదేహాన్ని తొలగించి ఆందోళనను విరమింపజేశారు. కొద్ది నెలల క్రితం ఇదే యువతికి సంబంధించి అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


