అనుమతి లేకుండా ఆర్చి నిర్మాణం తగదు | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా ఆర్చి నిర్మాణం తగదు

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

నూజివీడు: ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మార్‌ అప్పారావు కాలనీ వద్ద ‘కొలుసు పార్థసారధి సౌజన్యంతో’ అంటూ ఆర్చిని నిర్మించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఈ చర్య పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ధ్వజమెత్తారు. దీనిపై బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మార్‌ అప్పారావు కాలనీ వద్దకు వచ్చి అక్రమంగా నిర్మిస్తున్న ఆర్చిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ కాలనీని ఏర్పాటు చేశారని, ఇప్పుడు ‘పార్థసారథి సౌజన్యంతో’ అంటూ ఆర్చిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, పద్ధతి, విధానాలను పాటించకుండా ఆర్చిని కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

వివాదాలు సృష్టించి..

కాలనీకి శంకుస్థాపన చేసినప్పుడు ఈ కాలనీకి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని కొందరు నాయకులు సూచించగా, ఆయన దానిని నిరాకరించి ఎమ్మార్‌ అప్పారావు పేరు పెట్టాలని సూచించారని మేకా ప్రతాప్‌ గుర్తుచేశారు. వైఎస్‌ ఆజ్ఞ మేరకే ఈ కాలనీకి ఎమ్మార్‌ అప్పారావు పేరు పెట్టామన్నారు. ప్రశాంతంగా ఉండే నూజివీడు ప్రాంతంలో కావాలని వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని మంత్రి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కాలనీ పేరు వద్ద ఎవరి సౌజన్యం ఉండటానికి వీల్లేదని, కేవలం ‘ఎమ్మార్‌ అప్పారావు కాలనీ’ అని మాత్రమే ఉండాలన్నారు. సౌజన్యం పేరుతో బోర్డులు పెట్టుకుంటామంటే నూజివీడు పట్టణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, ‘కొలుసు పార్థసారథి సౌజన్యం’ అనే పేరును వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులు ఎందుకు అడ్డుకోలేదు?

తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మున్సిపల్‌ కమిషనరే స్వయంగా చెప్పినా, ఇక్కడ ఆర్చిని ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్‌ అధికారులు ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. అధికారులు ఇలా మిన్నకుండిపోవడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. గతంలో తాము కూడా ఆర్చి కట్టాలని అనుకున్నామని, దీనికి హైవే అధికారులకు దరఖాస్తు చేసుకోగా.. రోడ్డు విస్తరణ పనులు ఉన్నందున, అది పూర్తయిన తర్వాత నిర్మించుకోవచ్చని వారు సూచించారని తెలిపారు. ఈ కాలనీని ఏర్పాటు చేసింది కేవలం వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కొమ్ము వెంకటేశ్వరరావు, నాయకులు మలిశెట్టి బాబీ, బసవా వినయ్‌, కంచర్ల లవకుమార్‌, ఎమ్మార్‌ మస్తాన్‌, కాలి సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement