ఏలూరు టౌన్/దెందులూరు: ఏలూరు రూరల్ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏలూరు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు గుండుగొలను ప్రాంతానికి చెందిన చిన్ని దుర్గారావు (25)గా గుర్తించారు. ఇతను చేపల చెరువుల వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఏలూరు శివారులోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉన్నాడు. అనారోగ్య కారణాల వల్లనే ఇతను మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పెదవేగి : పోలవరం కుడి కాలువలో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పెదవేగి ఎస్సై హరి గోపాల్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... పెదవేగి మండలం వేగివాడకు చెందిన చిత్తూరు సాయి శిరీష ఏలూరులోని ఓ బ్యాంకులో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే గతనెల 30వ తేదీ నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం అంకన్నగూడెం లాకుల వద్ద శిరీష మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


