బుట్టాయగూడెం: పశువుల కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్‌రావు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక పశువుల ఆస్పత్రిని సందర్శించి, పశుసంవర్థక శాఖ ఏహెచ్‌ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఉచితంగా అందించే థైలేరియా టీకాల కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో విదేశీ సంకరజాతి ఆవులకు సంబంధించి థైలేరియా నివారణకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. సుమారు 2 వేల డోసులను 5 వేల పశువులకు వేస్తుండగా, ఇప్పటికే ఈ టీకా కార్యక్రమం 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. అలాగే, జిల్లాలో ఎల్‌నినో ప్రభావం పశుసంవర్థక శాఖపై లేదని, ప్రస్తుతం పశువులకు ఎటువంటి మేత కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,956 మంది రైతులకు 29 వేల కేజీల విత్తనాలను అందించామని, పశువులు ఉండి భూమిలేని రైతులకు వీటిని 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు జేవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


