ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా పదవీవిరమణ పొందిన అధికారులను ఘనంగా సత్కరించారు. ఏలూరు డీఐఆర్ ఏఆర్ ఎస్సై వెంకటేశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్ ఏఎస్సై వేద కుమారి, భీమడోలు పోలీస్ స్టేషన్ ఏఎస్సై వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు ప్రజలకు నిస్వార్థ సేవలందించి పదవీవిరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖ పట్ల అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పదవీవిరమణ పొందడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. పోలీస్ కుటుంబాలకు శాఖ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ట్రైనీ ఐఏఎస్ సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి, ఆర్‌ఐ సతీష్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దెందులూరు: దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుండుగొలను సెంటర్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుర్గారావు శరీరం నుజ్జునుజ్జు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


