ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ప్రజాప్రతినిధిపై ఆయన భార్య పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఏలూరు నగరానికి చేరుకున్న మెట్ట ప్రాంత ఎమ్మెల్యే సతీమణి తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినట్లు చెబుతున్నారు. సాక్షాత్తూ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం... దానిపై పోలీసులు చర్యలు చేపట్టడం సాధ్యమయ్యే పనేనా? సదరు ఎమ్మెల్యేకు కౌన్సెలింగ్ ఇస్తారా? అంటూ జనంలో చర్చ సాగుతుంది. కానీ బాధిత మహిళకు (ఎమ్మెల్యే భార్య) భరోసా దొరకలేదని అంటున్నారు. మొత్తానికి సదరు ఎమ్మెల్యే సారు సతీమణి ఎందుకు వచ్చారు? ఏమి జరిగిందనే విషయంపై ఆరా తీస్తే నో కామెంట్ అనే జవాబు చెప్పటం విడ్డూరంగా ఉంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే స్పెషల్ టెట్ మార్గదర్శకాలను సవరించాలని, లేనిపక్షంలో బుధవారం నుంచి మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద నిరవధిక ధర్నా చేపడతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మార్గదర్శకాల మార్పుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నోటీసు ఇవ్వగా, ఆయన మంగళవారం చర్చలకు పిలిచారని తెలిపారు. అయితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ, ఉత్తీర్ణత మార్కుల తగ్గింపు, స్కూల్ అసిస్టెంట్ గణితం, పీఎస్, బీఎస్ అభ్యర్థులకు వారి సొంత సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లపై కమిషనర్ నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ధర్నా యథావిధిగా కొనసాగుతుందని, జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తాడేపల్లిగూడెం: నాణ్యమైన పరిశోధనలతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖరశర్మ తెలిపారు. ఏపీ నిట్ పరిశోధన విభాగం, ఐఐసీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘పరిశోధన – అభివృద్ధి’పై ఆచార్యులు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ చంద్రశేఖరశర్మ, జీకేసీ ఐఈటీ మాల్డా మాజీ డైరెక్టర్ పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. పరిశోధనలో నైతిక విలువలు పాటించడం అత్యంత ప్రాధాన్యమని, నిధుల సాధనకు సమర్థవంతమైన పరిశోధనా ప్రతిపాదనలు కీలకమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పరమేశ్వరరావు మాట్లాడుతూ పరిశోధనకు తగిన సమస్యను ఎంపిక చేసుకోవడం నుంచి ప్రతిపాదన తయారీ వరకు శాసీ్త్రయ దృక్పథం అవసరమన్నారు. సమస్య ప్రాధాన్యత, లక్ష్యాలు, కార్యాచరణ, ఆశించిన ఫలితాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అసోసియేట్ డీన్ డాక్టర్ తపస్ పరమానిక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ కిరణ్ శాస్త్రి, ఐఐసీ ప్రెసిడెంట్ డాక్టర్ కార్తికేయశర్మ, వి. సందీప్, వీరేష్‌కుమార్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ వార్షిక సర్వసభ్య సమావేశం విజయవాడలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాకు మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. జిల్లాలో మానవతా సేవలను విస్తరించేందుకు ఉత్తమ సహకారం, ప్రోత్సాహం అందించినందుకుగాను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2025–26 సంవత్సరానికి గవర్నర్ గోల్డ్ మెడల్, మాజీ జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డికి 2024–25 సంవత్సరానికి గోల్డ్ మెడల్ లభించాయి. అలాగే నూతన జిల్లాల విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా రెడ్‌క్రాస్ అత్యుత్తమ సేవలందించి 2024–25 గాను రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతిని సాధించింది. ఈ అవార్డును జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.వి.ఎస్. భద్రిరాజు, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు.


