నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో గ్రామసభ
చింతలపూడి: మండలంలోని రేచర్ల, శెట్టివారిగూడెం గ్రామాల పరిధిలో ప్రతిపాదిత బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సర్వే, బొగ్గు తవ్వకాలపై స్థానిక రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో మంగళవారం శెట్టివారిగూడెంలో గ్రామసభ నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైతులు వారిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ ఇది కేవలం రైతుల అభిప్రాయ సేకరణ మాత్రమేనని, ఇప్పుడే పనులు ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పైలట్ పనులు దశలవారీగా జరుగుతాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతరం రిలయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మండలంలో మొత్తం 38 గ్రామాలను ఎంపిక చేయగా, ప్రభుత్వ అనుమతితో తొలిదశలో రేచర్ల, శెట్టివారిగూడెం పరిధిలోని సుమారు 1,000 ఎకరాల్లో సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. భూగర్భంలో బొగ్గు నిల్వల శాతం, విస్తీర్ణం, లోతు, పొరల పరిమాణాన్ని గుర్తించేందుకే ఈ ప్రాథమిక సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్నదాతల ప్రశ్నల వర్షం
రిలయన్స్ ప్రతినిధుల ప్రకటనపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు కీలక డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ముఖ్యంగ ఏయే సర్వే నంబర్లలో సర్వే జరుగుతుంది, సరిహద్దులేమిటో రైతులకు ముందే లిఖితపూర్వకంగా తెలపాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తీసుకోబోయే 7 వేల ఎకరాల సేకరణ విధానం, నష్టపరిహారం వివరాలను ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్న ప్రాంతాలకు స్థానిక రైతుల నుంచి 10 మందిని 15 రోజుల పాటు తీసుకెళ్లి, అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించాలని కోరారు. రైతుల పట్టా భూముల కంటే ముందు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ట్రయల్స్ నిర్వహించి పర్యావరణ ప్రభావాలను అంచనా వేయాలని డిమాండ్ చేశారు. గతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుల సమయంలో న్యాయమైన పరిహారం అందక తీవ్రంగా నష్టపోయామని, అభివృద్ధి పేరిట మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. గతంలో వేసిన ట్రయల్ బోర్ల కారణంగా 100 మీటర్ల పరిధిలోని భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, తాగు, సాగునీటి వనరులకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల సందేహాలను పూర్తిగా నివృత్తి చేసి, రక్షణపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేంతవరకు సర్వేతో సహా ఎలాంటి ప్రక్రియలనూ ముందుకు తీసుకెళ్లకూడదని గ్రామసభ ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. కాగా, రైతుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు.


