ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలిరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అనే వాక్యంతో కూడిన ఫొటోను ఉద్యోగులంతా తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఏలూరులోని డీఎస్‌ఓ, కలెక్టరేట్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కే. రమేష్ కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో? వివరిస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


