అంతర పంటతో అదనపు ఆదాయం
ఆరోగ్యానికీ మేలు
ద్వారకాతిరుమల: కొబ్బరి చెట్టు.. రైతుకు ఆదాయాన్ని అందించడమే కాదు.. మనిషి నిత్య జీవితంలోనూ విడదీయరాని భాగం. పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కొబ్బరి నీరు, గుజ్జు, నూనె, కొబ్బరి పాలు ఇలా ఆహారంలో వినియోగించే ఉత్పత్తులెన్నో. ఇక కొబ్బరి పీచు, చిప్ప, ఆకులు కూడా వివిధ రకాల వస్తువుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. అందుకే కొబ్బరి చెట్టును ’కల్పవృక్షం’గా పిలుస్తారు. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి సాగు, రైతుల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
వేలాది ఎకరాల్లో సాగు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 50,690 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణం ఉంది. కొబ్బరితోపాటు అనేక ప్రాంతాల్లో అంతర పంటగా కోకోను కూడా రైతులు సాగు చేస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ గణాంకాల్లోనూ కొబ్బరి ప్రధాన పంటగా నమోదైంది. కొబ్బరికి సంబంధించిన సాగు విస్తీర్ణం పెంపు, పునరుజ్జీవనం, తిరిగి నాటడం వంటి కార్యక్రమాలకు కొబ్బరి అభివృద్ధి మండలి పథకాల కింద సబ్సిడీలు కూడా అమలవుతున్నాయి.
డెల్టాలో కొబ్బరి తోటలే
గోదావరి డెల్టా పరిధిలోని పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పోడూరు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. గోదావరి కాలువల ద్వారా సమృద్ధిగా లభించే సాగునీరు, తేమతో కూడిన నేలలు కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కొబ్బరి ప్రధాన ఉద్యాన పంటగా విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి డెల్టా ప్రాంతంలోని పలు మండలాలు కొబ్బరి సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే ఏలూరు జిల్లా పరిధిలోనూ కొబ్బరి సాగు గణనీయంగా విస్తరించింది. ద్వారకాతిరుమల, కామవరపుకోట, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, దెందులూరు, భీమడోలు, ఏలూరు రూరల్, పెదవేగి, పెదపాడు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కొబ్బరి సాగు జిల్లాల్లో ఏలూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఇతర పంటల నుంచి కొబ్బరి సాగువైపు రైతులు మళ్లుతున్నారు.
పీచుతోనూ ఆదాయం
కొబ్బరికాయ రైతుకు ప్రధాన ఆదాయ వనరు. పచ్చికాయలకు, ఎండుకొబ్బరికి, కొబ్బరి నూనెకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాయలోని పీచుతో తాళ్లు, మ్యాట్లు, బ్రష్‌లు వంటి వస్తువులను తయారు చేస్తారు. చిప్పను బొగ్గు, ఇతర ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు. ఆకులతో చాపలు, బుట్టలు తదితర గ్రామీణ ఉత్పత్తులు తయారవుతున్నాయి.
ఉమ్మడి పశ్చిమలో కొబ్బరి సాగు విస్తీర్ణం ఇలా..
జిల్లా సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం అంచనా ఉత్పత్తి
(హెక్టార్లలో) (ఎకరాల్లో) (కాయలు)
ఏలూరు 15,408 38,070 246.5 కోట్లు
పశ్చిమగోదావరి 5,107 12,620 81.7 కోట్లు
22 వేలకు పైగా హెక్టార్లలో సాగు
కాయ నుంచి పీచు వరకు.. ప్రతి భాగం ఉపయోగమే
రైతులకు దీర్ఘకాలిక ఆదాయం
నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం
కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేయడం రైతులకు అదనపు ఆదాయ మార్గంగా మారుతోంది. ఒకే భూమిలో ప్రధాన పంటతోపాటు అంతర పంటను సాగు చేయడం ద్వారా భూమి వినియోగాన్ని పెంచుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి తోటల మధ్య ఎక్కువగా కోకో పంట సాగవుతోంది.
కొబ్బరి నీరు వేసవిలో సహజ పానీయంగా వినియోగిస్తారు. కొబ్బరి గుజ్జులో ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. కొబ్బరి పాలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను వంటతోపాటు సౌందర్య ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తారు. అయితే కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు అధికంగా ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


