పోలవరం నిర్వాసిత సర్వేలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసిత సర్వేలో జాప్యం

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్‌ పరిధిలోని కుక్కునూరు గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబాల ఇళ్ల నిర్మాణాల ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ సర్వేను అధికారులు ప్రకటించిన తేదీల్లో నిర్వహించకపోవడంపై నిర్వాసితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోగా, మరోసారి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తిగా సర్వేలు... గల్లంతవుతున్న పేర్లు

2017లోనే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారులు తొలిసారి సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రూపొందించిన తొలి జాబితాలో ఉన్న కొంతమంది నిర్వాసితుల పేర్లు తుది జాబితాకు వచ్చేసరికి గల్లంతయ్యాయి. దీంతో బాధితులు అధికారులకు దరఖాస్తులు సమర్పించగా, గతంలో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ కూడా నిర్వహించారు. అయినప్పటికీ, పేర్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో గతంలో జాబితా నుంచి మిస్సయిన, 41.15 కాంటూర్‌ పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఎర్రటా డిక్లరేషన్‌ ప్రతిపాదనల పరిశీలన కోసం మరోసారి ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కుక్కునూరు మండలంలోని దానరచర్ల గ్రామంలో ఆగస్టు 1న, కుక్కునూరులో ఆగస్టు 4న, కివ్వాకలో ఆగస్టు 7న సర్వే నిర్వహిస్తామని అధికారిక షెడ్యూల్‌ ప్రకటించారు. అయితే, ప్రకటించిన తేదీన సంబంధిత అధికారులు కుక్కునూరుకు వచ్చి సర్వే నిర్వహించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాల పరిశీలన, ఎర్రటా డిక్లరేషన్‌ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందన్న ఆందోళన వారిలో నెలకొంది.

ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది?

‘‘గతంలో సర్వే జరిగింది.. మళ్లీ ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ కూడా చేశారు. అయినప్పటికీ పరిహారం అందలేదు. ఇప్పుడు మరోసారి సర్వేకు తేదీలు ప్రకటించి, ఆ తేదీల్లో కూడా అధికారులు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. అసలు సర్వే ఎప్పుడు నిర్వహిస్తారో, మా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో స్పష్టత ఇవ్వాలి’’ అని నిర్వాసితులు కోరుతున్నారు. ఈ కాంటూర్‌ పరిధిలోని కొంతమందికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాల పరిహారం అందగా, జాబితాలో మిగిలిపోయిన వారు మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. పదేపదే సర్వేలు, వెరిఫికేషన్లు జరుగుతున్నా తుది పరిష్కారం మాత్రం కనిపించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement