పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులి జాడ ఇంకా లభించకపోవడంతో అటవీ శాఖ అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటలుగా అటవీ శాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు పులి సంచారాన్ని గుర్తించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
సిగ్నళ్లు నిలిచిపోవడంతో చిక్కుముడి
పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దానికి ప్రత్యేక రేడియో కాలర్ అమర్చినప్పటికీ, సోమవారం సాయంత్రం నుంచి ఎటువంటి సిగ్నళ్లు అందడం లేదు. దీంతో అసలు పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది? ఏ దిశగా ప్రయాణిస్తోంది? అనే విషయాలను అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రేడియో కాలర్ పనిచేయకపోవడం లేదా దట్టమైన కొండలు, రంధ్రాల మధ్యకు వెళ్లడం వల్ల సిగ్నళ్లు నిలిచిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
డ్రోన్లు, అడుగు జాడల ద్వారా శోధన
ఒకవైపు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆకాశ మార్గం గుండా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా, మరోవైపు ప్రత్యేక శిక్షణ పొందిన అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పులి అడుగు జాడలను (పగ్‌మార్క్స్) గుర్తించేందుకు అణువణువూ శోధిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని లోతైన మందంలోకి లేదా దట్టమైన కొండల మధ్యలోకి పులి వెళ్లిపోయి ఉంటుందా? అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
అటవీ అధికారుల మకాం, ప్రజలకు హెచ్చరికలు
పులి సంచరించిన ప్రాంతాలలోనే అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది మకాం వేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పులి జాడ స్పష్టంగా తెలిసే వరకు పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు, పశువుల కాపరులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానిక అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రాకూడదని, అటవీ ప్రాంతాల వైపు వెళ్లరాదని అటవీశాఖ రేంజర్ ఎస్‌కే వలీ సూచించారు.
24 గంటలుగా ముమ్మరంగా గాలింపు చర్యలు
సిగ్నళ్లు అందక పులి ఎక్కడుందో చెప్పలేకపోతున్న అధికారులు
డ్రోన్లు, శాటిలైట్ ట్రాకింగ్‌తో అణువణువూ శోధన


