న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో క్లస్టర్లు ఇలా..
బోధన కుంటుపడుతుంది
పక్క మండలానికి మార్చారు
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నిడమర్రు: విద్యారంగంలో మార్పుల పేరిట కూట మి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తాజాగా కస్టర్ కాంప్లెక్స్‌ల నిర్వహణలో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు వీటి నిర్వహణ తేదీలను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 144 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపై ఇలా.. గతేడాదిలో ప్రతి నెలా మూడో శనివారం ఉపాధ్యాయులంతా ఉదయం పాఠశాలకు హాజరై.. మధ్యాహ్నం నుంచి క్లస్టర్ సమావేశాలకు వెళ్లేవారు. అయితే ఇకపై ప్రతినెలా 3, 4 శనివారాల్లో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 22, 29 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ప్రతి పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా సగం మంది 22న, మిగిలిన వారు 29న తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్టు క్లస్టర్ మీటింగులకు 22న నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టు టీచర్లు, 29న లాంగ్వేజ్ టీచర్లు హాజరవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమావేశాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటలోపు ఆయా క్లస్టర్ల వద్ద లీప్ యాప్‌లో తప్పనిసరిగా ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంఈఓలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
సెలవులకు అవకాశం లేదు : క్లస్టర్ నిర్వహణ రోజుల్లో ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేవలం మెడికల్ గ్రౌండ్ మినహా ఎలాంటి సెలవులకు అవకాశం లేదు.
ఉపాధ్యాయులకు దూరాభారం
గతంలో సమావేశాలను ఆయా మండల పరిధిలో మూడు, నాలుగు క్లస్టర్లలో నిర్వహించేవారు. అయితే ఇకపై మండలం మొత్తం టీచర్లు ఒకే క్లస్టర్ సమావేశానికి హాజరవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్టు సమావేశాలైతే రెండు, మూడు మండలాల పరిధుల్లో నిర్వహించనున్నారు. దీంతో ఉపాధ్యాయులకు 15 నుంచి 40 కిలోమీటర్లు మేర దూరభారం కానుంది. ముఖ్యంగా మహిళా టీచర్లకు రవాణా సమస్య ఎదురుకానుంది.
టీచర్లు లేని బోధన ఎలా..
పాఠశాలల్లో సగం మంది ఉపాధ్యాయులే ఉంటే బోధన ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా రెండు రోజులపాటు బోధన కుంటుపడుతుందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలల విషయంలో టీచర్ సమావేశానికి వెళ్తే పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్లర్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌పై విధులు కేటాయించారు.
జిల్లా ప్రైమరీ సబ్జెక్ట్ మొత్తం
పశ్చిమగోదావరి 20 40 60
ఏలూరు 28 56 84
మొత్తం 48 96 144
నెలలో రెండు రోజులు క్లస్టర్ సమావేశాలతో ఆయా స్కూళ్లలో బోధన కుంటుపడే అవకాశం ఉంది. టీచర్లకు బోధనా సమయం తగ్గుతుంది. సమావేశాలు పక్క మండలాల్లో నిర్వహించడం వల్ల మహిళా ఉపాధ్యాయులకు దూరం భారం. ఉన్నతాధికారులు పునరాలోచించాలి.
– బొర్రా గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
సబ్జెక్టు కాంప్లెక్స్‌లు ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటివరకూ గణితం సబ్జెక్టు కాంప్లెక్స్ గణపవరంలోనే ఉంది. దీనిని ప్రస్తుతం అత్తిలి మండలానికి మార్పు చేశారు. దీంతో గణపవరంలోనే కొనసాగించాలని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచితే పరిశీలిస్తామన్నారు.
– పుప్పాల ప్రకాశరావు, ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు
సమావేశాల నిర్వహణపై ఏడాదికో మార్పు
గతంలో ఉదయం బడికి.. మధ్యాహ్నం మీటింగ్‌కు..
నేటి నుంచి సగం టీచర్లు సమావేశాలకు..
మిగిలిన వారికి పాఠశాలల్లో విధులు
మూడు, నాలుగు శనివారాల్లో ఇదే పరిస్థితి


