పొగాకు సేద్యం.. డోలాయమానం | - | Sakshi
Sakshi News home page

పొగాకు సేద్యం.. డోలాయమానం

Aug 22 2026 1:23 AM | Updated on Aug 22 2026 1:23 AM

నాణ్యమైన వంగడాలతోనే..

బుట్టాయగూడెం: పొగాకు రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక కొందరు రైతులు అ ల్లాడుతూ ఇళ్ల వద్దే బేళ్లు నిల్వ ఉంచే దుస్థితి కాగా మరోవైపు వచ్చే ఏడాది పంటలు పండించేందుకు కొందరు నారుమడులు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో అధిక దిగుబడులు ఇచ్చే నారుమడులను సిద్ధం చేస్తున్నారు.

అప్పు తీరనూ లేదు.. మళ్లీ సాగు తప్పదు

పొగాకు రైతులు పండించిన పంట అమ్ముడుపోకపోవడంతో చాలా మంది రైతులు అప్పులు తీర్చే మార్గంలేక కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 120 రోజులు దాటుతున్నా కేవలం 20 శాతం మాత్రమే కొనుగోళ్లు జరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పాత పంట అమ్ముడుపోలేని పరిస్థితిలో ఉన్నా మరోపక్క కొత్త పంట పండించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వచ్చేనెల రెండో వారం నుంచి పొగాకు నారుమడులకు అనువైన సమయం కావడంతో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. 2026–27 పంటల సాగుకు సంబంధించి బోర్డు కూడా అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఐటీసీ సంస్థ ద్వారా ఎల్‌–7, 1335 వంగడాలను నారుమడుల్లో వేస్తున్నారు. జంగారెడ్డిగూడెం–1,2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో సుమారు 33 వేల హెక్టార్లలో పొగాకు సాగు జరుగుతుంది. ఒడిదుడుకులు ఉన్నా రైతులు మాత్రం పొగాకు సాగుకు మొగ్గుచూపుతున్నారు.

ట్రే నర్సరీల ఏర్పాటు

రైతులు ఎక్కువగా ట్రే నర్సరీలలో పొగాకు నారుమడులను ఏర్పాటు చేస్తున్నారు. పొలాల్లో షెడ్‌ నెట్‌ పందిర్లను వేసి నారుమడులను పెంచుతారు. ట్రే నారు నాణ్యతగా ఉండి చీడపీడలను తట్టుకుంటుందని రైతులు చెబుతున్నారు. నారు ధర ఎక్కువగా ఉన్నా ట్రే నారులను రైతులు ఎక్కువగా నాటుతున్నారు. అక్టోబర్‌ నుంచి పొగాకు పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ట్రే నారుమడులను జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి, మండలాలతో పాటు పలు గ్రామాల్లో కూడా పెంచుతున్నారు.

పొగాకు ఉత్పత్తికి కోత

2026–27 పంట కాలానికి పొగాకు బోర్డు 28.02 మిలియన్‌ కిలోలకే అనుమతి ఇచ్చింది. 2025–26 పంట కాలానికి 50.87 మిలియన్‌ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా దానిని కుదించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది బేరన్‌కు 2,000 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బేరన్‌కు 2 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలి. ఒక్కో సాగుదారుడికి గరిష్టంగా 4 బేరన్‌లకు అనుమతి ఇచ్చారు. 2025–26 పంట కాలంలో బేరన్‌కు 41 క్వింటాళ్లకు అనుమతి ఇవ్వగా దీనిని వచ్చే ఏడాది 20 క్వింటాలకు తగ్గించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఇళ్లల్లోనే బేళ్లు.. నారుమడులకు సన్నాహాలు

అధిక దిగుబడులిచ్చే వంగడాలపై దృష్టి

28.02 మిలియన్‌ కిలోలకే అనుమతి

అయోమయంలో పలువురు రైతులు

గతంలో పండించిన పంట ఇంకా పూర్తిస్థాయిలో అమ్మకాలు జరగలేదు. వచ్చే ఏడా ది పంట కాలం రానే వచ్చింది. ప్రస్తుతం పొగాకు నారుమడులు కట్టేందుకు అనువైన సమయం కావడంతో నారుమడులు సిద్ధం చేసుకుంటున్నాం. ట్రే నారుల వల్ల నాణ్యమైన మొక్కలు రావడంతో ఇటుగా మక్కువ చూపుతున్నాం.

– సయ్యద్‌ బాజీ, పొగాకు రైతు,

అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement