ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్యక్షేత్రం వేదికగా సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన బాల వికాస్ కేంద్ర మాతాజీలు, ఆచార్యుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 10, 11, 12 తేదీల్లో మాధవ నిలయంలో నిర్వహించిన తరగతుల్లో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పాల్గొన్నారు. టీటీడీ ఆర్థిక సాయంతో ఎస్‌ఎస్‌ఎఫ్ నిర్మించిన ఆలయాల పరిధిలోని కాలనీలు, పేటలు, బస్తీల్లోని విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలు, పాటలు, ఆటలు, కళలను నేర్పించేందుకు బాల సంస్కార్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు మార్గదర్శనం చేసేందుకు ఏటా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బాల వికాస్ కేంద్రాల ద్వారా చిన్నారుల్లో నైతిక విలువలు, భారతీయ సంస్కృతిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం క్షేత్ర పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు.


