జంగారెడ్డిగూడెం: పట్టణ పరిధిలోని రామచంద్రపురంలో ఆదివారం మధ్యాహ్నం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. వీధుల్లో వెళ్తున్న వారిపై పడి సుమారు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు కుక్కను వెంటాడి హతమార్చారు. గాయపడినవారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సకాలంలో వైద్య చికిత్సలు అందించారు. ఈ ప్రాంతంలో ఇంకా వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని, ప్రక్కనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


