130 ఏళ్ల చరిత్ర
దశావతారాలు ఇలా..
● ఈనెల 16 నుంచి జగన్నాథ రథోత్సవాలు
● పూరీ క్షేత్ర తరహాలో వైభవంగా వేడుకలు
ద్వారకాతిరుమల: పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథోత్సవాల తరహాలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర దత్తత ఆలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 25 వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం మండపాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించడంతో పాటు ఆలయం, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరిస్తున్నారు. రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు.
ద్వారకాతిరుమలకు తొలి రథయాత్ర
ఉత్సవాల ప్రారంభ రోజైన 16న సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారు రథ వాహనంపై కొలువుదీరి లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. ఉత్సవాల ఆఖరి రోజైన 25న (ఏకాదశి నాడు) ఆలయం నుంచి సమీపంలోని తిమ్మాపురం గ్రామం వరకు రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే పది రోజుల పాటు జగన్నాథ స్వామి దశావతార అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు.
లక్ష్మీపురం జగన్నాథ ఆలయానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశా రాష్ట్రంలోని పూరీకి చెందిన మఠాధిపతి మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. జగన్నాథ స్వామివారితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆలయంలో కల్యాణోత్సవం, పవిత్రోత్సవం వంటి కై ంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న అనంతరం జీర్ణోద్ధరణ పనులు చేపట్టి మరింత అభివృద్ధి చేసింది. ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవి, ఆళ్వారులు, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధులు ఉన్నాయి.
16 న మత్స్యావతారం
17 కూర్మావతారం
18 వరాహావతారం
19 నరసింహావతారం
20 వామనావతారం
21 పరశురామావతారం
22 శ్రీ రామావతారం
23 శ్రీ బలరామావతారం
24 శ్రీ కృష్ణావతారం
25 న శ్రీ కల్కి అవతారం


