తణుకు అర్బన్: ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటథ్లాన్ లేజర్ రన్ పోటీల్లో తణుకు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సంకు విరాటలక్ష్మి తెలిపారు. అండర్–9 విభాగంలో ఎన్.రుత్విక్ నాగ్ స్వర్ణ పతకం, అండర్–15 విభాగంలో ఐ.ఆశ్రిత స్వర్ణ పతకం, అండర్–17 విభాగంలో జి.పవిత్ర, కె.సాత్విక్‌లు స్వర్ణ పతకాలు, ఎస్.షణ్ముఖ సంతోష్ కాంస్య పతకం సాధించారు. రిలే అండర్–17 విభాగంలో బాలురు, బాలికలు స్వర్ణ పతకాలు, మిక్స్‌డ్ రిలేలో స్వర్ణ పతకాలు సాధించినట్లు వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు రేలంగి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంకు సూర్యనారాయణ, టీం కోచ్ పీవీఎస్ సాయిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్.అప్పారావు అభినందించారు.
కుక్కునూరు: మండలంలోని బంజారగూడెం గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాచ్‌మన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుక్కునూరు పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన చిట్రాల చంద్రశేఖర్ (40) గత మూడేళ్లుగా బంజారగూడెంలోని నరుకుల నరసింహరావుకు చెందిన యూకలిప్టస్ చాంబర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు కొచ్చర్లపాటి నరేష్ అనే వ్యక్తితో కలిసి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి వస్తుండగా, కుక్కునూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రశేఖర్ తలకు, ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం చాంబర్ యజమాని మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కల్యాణ, అన్నదాన మండపాల నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఆలయం నిరంతరం భక్తులతో కళకళలాడుతుండటం, ముఖ్యంగా ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణకు వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో అన్నదాన, కల్యాణ మండపాలు, పార్కింగ్ స్థలం అవసరాన్ని గుర్తించిన ఆలయ కమిటీ, కూటమి నాయకులు ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం 10:50 గంటలకు ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ, జెడ్పీటీసీ పోల్నాటి బాజ్జి, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు అన్నాప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, ఆరేపల్లి నాని, వడిగళ్ల కుమారి, ముప్పిడి భానులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బిన దత్తాత్రేయ, సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆలయ ఈఓ ఆర్.వి. చందన తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు భక్తులు వేరువేరుగా రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. అందులో భాగంగా నూజివీడుకు చెందిన చమనపూడి వెంకటరమణ రూ.లక్ష, గుడివాడకు చెందిన నీలం పాండురంగారావు రూ. 1,00,116 శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం తదితరులు విరాళం బాండ్ పత్రాలను అందజేశారు.


