నాగిరెడ్డిగూడెం పాఠశాల ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

నాగిరెడ్డిగూడెం పాఠశాల ఎదుట ధర్నా

Jul 13 2026 1:10 AM | Updated on Jul 13 2026 1:10 AM

చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కొరతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో గత పది రోజులుగా తాగునీరు, నిత్యావసరాలకు సరిపడా నీరు రాకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉదయం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాలలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కనీసం స్నానాలు చేయడానికి, టాయిలెట్లకు వెళ్లడానికి కూడా నీరు లేక నరకం చూస్తున్నామని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. సమస్యపై పాఠశాల యాజమాన్యం స్థానిక అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ స్పందించకపోవడంతో, విధిలేక తాము రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై పాఠశాల ప్రిన్సిపాల్‌ హేమలతను వివరణ కోరగా.. పాఠశాలలో ఉన్న రెండు బోర్లలో ఒకదానిలో భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీరు సరిగా రావడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తాగునీటికి ఇబ్బంది లేదని, మున్ముందు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement