పెంటాథ్లాన్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పెంటాథ్లాన్‌ పోటీలు ప్రారంభం

Jul 12 2026 1:11 AM | Updated on Jul 12 2026 1:11 AM

పెంటాథ్లాన్‌ పోటీలు ప్రారంభం కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు మాట నిలబెట్టుకున్న ఉపాధ్యాయుడు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మోడరన్‌ పెంటాథ్లాన్‌ లేజర్‌ రన్‌ ఛాంపియన్‌ షిప్‌ – 2026 క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందకు సాగాలన్నారు. ఈ క్రీడలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఏపీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ కే. జగదీశ్వరి, డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌, ఏపీ మోడరన్‌ పెంటాథ్లాన్‌ చైర్మన్‌ సీహెచ్‌.వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్‌ కే. హరిబాబు, వైస్‌ చైర్మన్‌ పీ. షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం టి.చల్లపల్లికి చెందిన ఐదుగురు ఓ కారులో ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యమైన భీమడోలు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ముందుగా వెళ్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్‌ ఏ.ప్రకాష్‌, ప్రయాణికులు జయరాం శ్రీనివాస్‌, సుంకర సందీప్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. భీమడోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.

100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి విమాన ప్రయాణం

లింగపాలెం: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి ఆదర్శంగా నిలిచారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కె.వజ్రకుమార్‌ విద్యార్థుల్లో చదువుపై పోటీతత్వాన్ని పెంచేందుకు ఒక వినూత్న ప్రకటన చేశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం (సోషల్‌ స్టడీస్‌) సబ్జెక్టులో 100కు 100 మార్కులు సాధించిన వారికి ఉచితంగా విమానంలో హైదరాబాద్‌ తీసుకెళ్లి, అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపిస్తానని మాటిచ్చారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో కష్టపడి చదివిన కొండపల్లి వినయ్‌ అనే విద్యార్థి పబ్లిక్‌ పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించి లక్ష్యాన్ని అందుకున్నాడు. దీంతో ఉపాధ్యాయుడు వజ్రకుమార్‌ తన మాట నిలబెట్టుకుంటూ, సదరు విద్యార్థి విమాన ప్రయాణ ఖర్చులను స్వయంగా భరించి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థికి పలు పర్యాటక ప్రాంతాలను చూపించి సరికొత్త అనుభూతిని అందించారు. విద్యార్థిని ఈ విధంగా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వజ్రకుమార్‌ను నూజివీడు డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి పీఎస్‌. సుధాకర్‌, ఎంఈఓలు కేవీకే దుర్గారావు, జె.రవీంద్ర, ఎస్‌ఎంసీ చైర్మన్‌ గద్దల తబిత అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement