అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు

Jul 12 2026 1:11 AM | Updated on Jul 12 2026 1:11 AM

అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

భీమవరం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే జూనియర్‌ బాలుర అంతర్‌ జిల్లాల చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా జూనియర్‌ బాలుర జట్టు పాల్గొంటుందని జిల్లా అసోసియేషన్‌ గౌరవ చైర్మన్‌ ఇళ్ల రాధాకృష్ణ శనివారం చెప్పారు. నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలకు వెళ్లిన క్రీడాకారులకు రాధాకృష్ణ, ఉప అధ్యక్షులు ఎఎస్‌ఎన్‌ రాజు, ఇళ్ల మధుసూదనరావు, కార్యదర్శి వానపల్లి రమేష్‌, గౌరవ అధ్యక్షుడు పాపోలు ఏడుకొండలు శుభాకాంక్షలు తెలిపారు.

భీమవరం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణికి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ వుదిసి వెంకట పాండురంగారావు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ తక్షణమే వేయాలని, తాత్కాలిక భృతి, ఐఆర్‌, పెండింగ్‌లో ఉన్న డీఏ, సరెండర్‌ లీవ్‌ ఇవ్వడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కామరాజు, ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణ, పేపకాయల కృష్ణ, జేఏసీ సెక్రెటరీ రామచంద్రరావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సాయివర్మ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిట్టూరి హరిప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టెంపాలెం గ్రామంలో శొంఠి లక్ష్మీనారాయణకు చెందిన పామాయిల్‌ తోటలో ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెంకు చెందిన పుట్టి నాగదుర్గారావు (19), అతని తండ్రి ఆదినారాయణ, కొత్తపల్లి వెంకటరమణ పనికి వెళ్లారు. శనివారం ఇనుప కోత పరికరంతో పామాయిల్‌ గెలలను కోస్తుండగా ప్రమాదవశాత్తు పరికరం విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో నాగదుర్గారావు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆదినారాయణ, కొత్తపల్లి వెంకటరమణ కలిసి తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement