జంగారెడ్డిగూడెం: కొయ్యలగూడెం, గోపాలపురం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్న 28 హైగ్రేడ్ పొగాకు బేళ్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు ఎన్‌ఎల్‌ఎస్ రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారంతో నిఘా ఉంచిన విజిలెన్స్ అధికారులు కిరణ్ జీఎం, సాయి ప్రశాంత్, ధర్మతేజ రెండు ఆటోల్లో తరలిస్తున్న ఈ పొగాకును పట్టుకుని, తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారన్నారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, కేవలం వేలం కేంద్రాలలోనే పొగాకు అమ్మాలని కోరారు. అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బోర్డు నిబంధనల ప్రకారం బహుమతి కూడా ఇస్తామన్నారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు 100 కేజీల బేలుకు రూ.500, మీడియం గ్రేడ్ బేలుకు రూ.400, లో గ్రేడ్ బేలుకు రూ.200, పొగాకు చూరా బేలుకు రూ.100 చొప్పున పారితోషికం ఇస్తామన్నారు. సమాచారం కోసం ఔస్‌డీ విజిలెన్స్ గుంటూరు 91540 30702, జంగారెడ్డిగూడెం 98497 77055 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్‌ఎం సురేంద్రకుమార్ తెలిపారు.


