వేలేరుపాడు: ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా గోదావరి నదికి వచ్చే వరదల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయక చర్యలపై ఏలూరు జిల్లా పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా మండలంలోని రుద్రమకోట గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వరద సమయంలో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను కాపాడుకుంటూనే, బాధితులను ఎలా కాపాడాలనే అంశాలపై ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. రెస్క్యూ సమయంలో ఉపయోగించే బోట్లు, లైఫ్ జాకెట్లు, ఇతర అత్యాధునిక పరికరాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా అధికారుల సూచనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, కుక్కునూరు ఇన్‌స్పెక్టర్ బాల సురేష్బాబు, వేలేరుపాడు ఎస్సై నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


