ఆపరేషన్‌ గోల్డ్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ గోల్డ్‌మాల్‌

Jul 11 2026 1:06 AM | Updated on Jul 11 2026 1:06 AM

ఆపరేషన్‌ గోల్డ్‌మాల్‌

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన భారీ గోల్డ్‌లోన్‌ మోసాన్ని పోలీసులు ఛేదించారు. వినియోగదారులు తాకట్టు పెట్టిన దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంక్‌ గోల్డ్‌ అప్రైజర్‌ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలను కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే బ్యాంక్‌లో భారీగా గోల్డ్‌ లోన్‌ మోసం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్‌.సుస్మిత ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా 176 గోల్డ్‌ లోన్‌ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన, దాదాపు 6.449 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్లు తేలింది.

గోల్డ్‌ అప్రైజర్‌ రాజు అరెస్ట్‌

ఈ మోసానికి పాల్పడిన జంగారెడ్డిగూడెం వెలమపేట ప్రాంతానికి చెందిన బ్యాంక్‌ గోల్డ్‌ అప్రైజర్‌ చలపాక రాజును పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలైన బంగారాన్ని అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అపహరించిన బంగారాన్ని నిందితుడు తన పేరుతో, తన తల్లిదండ్రుల పేరుతో జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యూవెలరీ షాపుల్లో విక్రయించడమో లేదా తాకట్టు పెట్టడమో చేసినట్లు ఆధారాలు లభించాయి.

సొత్తు రికవరీ.. సిబ్బందికి అభినందనలు

నిందితుడి నుంచి రూ. 10 లక్షల నగదును, వివిధ జ్యూవెలరీ షాపుల నుంచి సుమారు 4.120 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు విలువ సుమారు రూ.5.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో లోతైన విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్పీ సుస్మిత, సీఐ ఎం.వి.సుభాష్‌, ఎస్సైలు ఎన్‌.వీరప్రసాద్‌, ఎం.కుటుంబరావు, ఎస్‌.కె.జబీర్‌, ఎస్‌.వల్లీపద్మ, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలీసులు

రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం

రూ.10 లక్షల నగదు, 4.12 కిలోల బంగారం రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement