ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరంలోని ఉప విద్యాశాఖాధికారి (డిప్యూటీ డీఈఓ) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఏలూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 84, 73, 74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా కార్పొరేషన్ ఉపాధ్యాయులను ఇతర యాజమాన్యాల్లోకి సర్దుబాటు చేయడం వల్లే కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించినట్టు చెప్పారు. కార్పొరేషన్ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను ఇతర యాజమాన్య పాఠశాలలకు బదిలీ చేయడమే కాకుండా, నగరానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపాలని చూడటం ఉపాధ్యాయులను తీవ్రంగా వేధించడమేనని వారు మండిపడ్డారు. ఈ మేరకు ఏలూరు ఉప విద్యాశాఖాధికారి నిమ్మగడ్డ రవీంద్ర భారతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురమా ఆనంద్ కుమార్, అబ్బదాసరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు సీహెచ్ షణ్ముఖి, జొన్నకూటి రాజారావు పాల్గొన్నారు. అయితే నగరపాలక సంస్థకు చెందిన సుమారు 10 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాలేదని, శనివారం నిర్వహించే సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాని పక్షంలో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులకు ఉప విద్యాశాఖాధికారి మెసేజ్‌లు పంపారు. నిబంధనల ప్రకారం సర్దబాటు చేయని పక్షంలో కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.


