తడవని మడి.. అన్నదాత అలజడి | - | Sakshi
Sakshi News home page

తడవని మడి.. అన్నదాత అలజడి

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

ఖరీఫ్‌ సాగు రైతుల కంట కన్నీరుకు కారణమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీరు అందక ఏలూరు జిల్లా కై కలూరు నియోజకవర్గంలోని వరి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. పాలకులు జలహారతుల పేరుతో పూజలు చేసినా పంట కాలువల్లో నీటి ప్రవాహం కనిపించడం లేదు. వరుణుడు కూడా ముఖం చాటేయడంతో రైతులు వెదజల్లిన వరి నారు నీరు లేక ఎండిపోతోంది.

కైకలూరు: కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21,832 ఎకరాల వరిసాగు విస్తీర్ణానికి గాను ఇప్పటికే 7,080 ఎకరాల్లో మార్టేరు, స్వర్ణ, 1318 రకాలను వెదజల్లారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోల్‌రాజ్‌ కాలువకు 600 క్యూసెక్కులు, క్వాంప్‌బెల్‌ కాలువ నుంచి 700 క్యూసెక్కులు నీరు విడుదల కావాల్సి ఉన్నా, గట్లు బలహీనంగా ఉన్నాయనే నెపంతో అధికారులు పూర్తిగా నీటిని వ దలడం లేదు. ఇప్పటికే వారం నుంచి 20 రోజుల వ్యవధికి నారు చేరుకుంది. కై కలూరు మండలం రాచపట్నం, గోపవరం, మండవల్లి మండలం కా నుకొల్లు, లింగాల, కలిదిండి మండలం పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది.

పెట్టుబడి భారం.. కౌలు కష్టం

ప్రస్తుతం ఎకరం వరి సాగుకు (దుక్కులు, ఎరువులు, కోతలు, కూలీలతో కలిపి) రూ.30,000 ఖర్చవుతోంది. ఎకరానికి 30 బస్తాల దిగుబడి వస్తే, బస్తా రూ.1,760 చొప్పున రూ.52,800 ఆదాయం లభిస్తుంది. అయితే ఇందులో 12 బస్తాలు కౌలు కింద భూ యజమానులకు ఇవ్వాల్సి రావడంతో, తమకు మిగిలేది శూన్యమని కౌలు రైతులు వాపోతున్నారు.

ఆక్వా చెరువులకే నీటి మళ్లింపు

కై కలూరులో 84,852 ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. పంట కాలువల మరమ్మతులు చేయకపోవడంతో చెత్త పేరుకుపోయింది. తాగు, సాగునీటి కోసం విడుదల చేసే నీటిని ఆక్వా చెరువులకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. నీటి సంఘాల ప్రతినిధులుగా అధిక శాతం చేపల రైతులే ఉండటంతో వరి రైతుల డిమాండ్లను పట్టించుకునేవారే కరువయ్యారు.

నారు ఎండుతోంది

వెదజల్లిన వరి రైతుల గగ్గోలు

సాగునీటి సరఫరాలో ప్రభుత్వం విఫలం

బీటలు వారుతున్న వరి చేలు

రాచపట్నంకు చెందిన చేబోయిన రామకృష్ణ నాలుగు ఎకరాల్లో కావేరి, స్వర్ణ రకం వరి వెదజల్లి సుమారు రూ.50 వేలు ఖర్చు చేశారు. 15 రోజులు దాటినా కాలువలో నీరు లేక పంట ఎండిపోయింది. అలాగే మరో రైతు మాడెం రామయ్య 11 ఎకరాల్లో వెదజల్లి రూ.1.5 లక్షలు ఖర్చు చేశారు. 20 రోజులు గడుస్తున్నా చుక్క నీరు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement