పోలవరం రూరల్: ముఖ్యమంత్రి ఈనెల 13న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నందున కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాన్ని, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో పనుల పురోగతి, ఎగ్జిబిషన్ వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పట్టిసీమలో సదుపాయాలపై ఆరా
గోదావరి పుష్కరాల సందర్భంగా పట్టిసీమలో స్నానఘట్టాల ఏర్పాటు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై కలెక్టర్ అధికారులతో కలిసి పట్టిసీమ రేవు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రోజుకు ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పెనుమంట్ర: రాష్ట్ర జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనన్ల అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం పెనుమంట్ర తహసీల్దార్‌కు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, తక్షణం ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఆర్ ఇవ్వాలని, తగ్గించిన ఎడిషన్ క్వాంటం యథావిధిగా కొనసాగించాలని, హెల్త్ కార్డ్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.


