ఉండి : గోడ కట్టారు.. కాలువ పూడ్చారు అన్నట్లుంది ఉండి కాలువపై చేపట్టిన రివిట్‌మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణం. గత మే నెలలో జాతీయ రహదారి కుంగిపోకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకివీడు మండలం అజ్జమూరు పరిధిలో చిన్న చిన్న ముక్కలుగా ఈ గోడను నిర్మించారు. నెల రోజుల పాటు ట్రాఫిక్ నిలిపివేసి హడావుడిగా పనులు ముగించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అసంపూర్తి పనులు – కుంగుతున్న గట్టు
అధికారులు జాతీయ రహదారి భద్రతపైనే దృష్టి పెట్టి కాలువను నిర్లక్ష్యం చేశారు. గోడను అసంపూర్తిగా ముక్కలు ముక్కలుగా కట్టడంతో, మధ్యలో ఖాళీ ఉన్న ప్రాంతంలో రోడ్డు కాలువలోకి కుంగిపోతోంది. మరోవైపు కాలువ గట్టు కూడా మట్టితో సహా కాలువలోకి జారిపోతోంది. దీనివల్ల కాలువ పూడుకుపోయి శివారు ప్రాంతాల వరిచేలకు, ఆక్వా చెరువులకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు.
విద్యుత్ స్తంభాలతో పెను ప్రమాదం
నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రహదారి పక్కనే ఉన్న భారీ విద్యుత్ స్తంభాలు కాలువలోకి వాలిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు కూలిపోతే పెను ప్రమాదం జరిగే అవకాశముంది. కాలువ గట్లు జారిపోకుండా, వాలిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక రైతులు, ప్రయాణికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.


