నూజివీడు: అభివృద్ధి చేయడం చేతకాని పిరికిపందలే గతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ప్రజలకు కనిపించకుండా చేయడానికి ప్రయత్నిస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. వైఎస్ జయంతి సందర్భంగా రోగులకు రొట్టెలు, పండ్లు పంచేందుకు బుధవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆసుపత్రి ప్రారంభించిన వివరాలతో కూడిన శిలాఫలకాన్ని గుడ్డతో కప్పి ఉంచారు. దీనిని చూసిన ప్రతాప్ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ గుడ్డను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూ.24 కోట్లను మంజూరు చేయించి కార్పొరేట్ ఆసుపత్రిని తలపించేలా అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత పాలకులు కూడా చేతనైతే నూజివీడును అభివృద్ధి చేయాలేగానీ గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను కనిపించనీయకుండా ఉంచాలని చూడటం వారి అవివేకానికి నిదర్శమన్నారు. ఇంకెప్పుడైనా శిలాఫలకాన్ని మూసివేయడం చేస్తే కార్యకర్తలతో కలసి వచ్చి ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. రోగులకు అవసరమైన సదుపాయలను కల్పించి మరింత అభివృద్ధి చేసి శిలాఫలకాలు వేసుకోవచ్చని, గత ఐదేళ్లల్లో ఏనాడైనా తాను పాత శిలాఫలకాలను కనిపించకుండా చేశానా అని ప్రశ్నించారు. ప్రజలకు సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడమే కాకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేశామన్నారు. నూజివీడు అభివృద్ధి అనేది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోను, వైఎస్ జగన్ పాలనలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మాత్రం చెరువులను, కొండలను లూటీ చేయడమే తప్ప నూజివీడుకు ఈ రెండేళ్లల్లో సాధించింది శూన్యమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అడ్డగోలుగా గోతులు తవ్వి మట్టిని దోచేస్తున్నారని, భారీ గోతుల వల్ల భవిష్యత్‌లో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు


