వ్యక్తిని బలిగొన్న భూ వివాదం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిని బలిగొన్న భూ వివాదం

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

జంగారెడ్డిగూడెం: కొద్దిపాటి వ్యవసాయ భూమి కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదం చివరకు రక్తపాతానికి దారితీసింది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ శివారులోని రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం కారుమూరి దుర్గారెడ్డి (55) తన అన్న కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పేరంపేట గ్రామానికి చెందిన కారుమూరి వెంకటరెడ్డి, దుర్గారెడ్డి అన్నదమ్ములు. వీరికి పంగిడిగూడెం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న 1.70 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని, భూమిని ఇప్పించాలని దుర్గారెడ్డి గతంలో జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గత ఆదివారం కూడా పొలంలో పని చేసుకుంటుండగా వెంకటరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి వచ్చి దుర్గారెడ్డిపై దాడికి ప్రయత్నించాడు. దీనిపై బాధితుడు డయల్‌ 112కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి బైండోవర్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం దుర్గారెడ్డి రైతు భరోసా కేంద్రం వద్ద కూర్చుని ఫోన్‌ మాట్లాడుతుండగా, అతని అన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే..

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గారెడ్డిని హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని హత్యకు అరగంట ముందే మా క్యాంపు కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫోన్‌ చేసి రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు సకాలంలో స్పందించ లేదని, ఇది ముమ్మాటికీ శాంతిభద్రతల వైఫల్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా వైఫల్యం లేదు

దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఎస్పీ సుస్మిత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వివాదాస్పద భూమిని దున్నుతున్నారని సమాచారం అందడంతో, పోలీసులు పనులు నిలిపివేయించి వెళ్లారని వివరించారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే దుర్గారెడ్డి హత్యకు గురయ్యాడని తెలిపారు.

బాబాయిని నరికి చంపిన వ్యక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement