గుడికి దారేది? | - | Sakshi
Sakshi News home page

గుడికి దారేది?

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

దేవుడికి అప్పగించాల్సిందే

లక్ష్మీపురంలో ఆలయ భూ వివాదం రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతోంది. వివాదాస్పదంగా మారిన భూమిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి ఉండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే సదరు భూమిలో నరికి విక్రయించగా వచ్చిన చెట్ల సొమ్ము ఏ నాయకుడి జేబులోకి వెళ్లిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేవుడి భూమి కబ్జా వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై ఇంతవరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూరీ మఠాధిపతులు మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992 లో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఆలయం, దానికి సంబంధించిన ఆర్‌ఎస్‌ నెంబర్‌ 38/1 లోని 1.73 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఫెయిర్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ (ఎఫ్‌ఎల్‌ఆర్‌)లో సదరు భూమి దాత కుటుంబ సభ్యుడైన శ్రీమత్‌ మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్‌ కుమారాచార్యులు పేరు ఉంది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ కారణంగా రెవిన్యూ రికార్డుల్లోకి స్వామివారి పేరు చేరలేదు. దాంతో దేవుడి భూమి ఇప్పుడు చిక్కుల్లో పడింది.

అంతా తప్పులతడకే..

దాత సంపత్‌ కుమారాచార్యులు సదరు భూమిని 1967 జనవరి 18న కమ్మ సేవ సంఘం ద్వారకాతిరుమల మండలానికి బహుమతిగా ఇచ్చినట్టు కొందరు టీడీపీ నేతలు ఒక అన్‌రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ను తెచ్చారు. దాని ఆధారంగానే రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ రికార్డులను సంఘం పేరు మీదకు మార్చారు. ఇటీవల దీనిపై వివాదం రాజుకోవడంతో మళ్లీ సదరు భూమి ఆన్‌లైన్‌ రికార్డులను మ్యూటేషన్‌ ద్వారా అధికారులు మార్చారు. దానికి సంబంధించిన ఆన్‌లైన్‌ రికార్డ్‌ ఇంకా అప్‌డేట్‌ కాలేదు. అయితే తప్పు జరగబట్టే అధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టినట్టు స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి సైతం వివాదాస్పద సర్వే నెంబర్‌ భూమిలోనే ఉన్నాయి. దాత గుడిని దేవస్థానానికి అప్పగించి, గుడి దారిని సంఘానికి రాసిచ్చారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూమి దేవస్థానం చేజారితే ఆలయానికి వెళ్లే దారి కూడా ఉండదని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

చెట్లు అమ్మిన సొమ్ము ఎక్కడ?

టీడీపీ నేతలు సదరు భూమి తమ చేతిలోకి వచ్చిందన్న ఆనందంతో ఇటీవల అందులోని పెద్ద పెద్ద చెట్లను, తులసి మొక్కలను తొలగించారు. చెట్ల కలపను అమ్ముకుని రూ.50 వేల వరకు సదరు నాయకులు లబ్ధి పొందినట్టు సమాచారం. ఆ సొమ్ము ఏ నాయకుడి జేబులోకి చేరిందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వివాదాస్పద భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెబుతున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చెట్ల సొమ్మును కూడా ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచాలి కదా.. తమ నేతల జేబుల్లో ఉంచడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీ వారు కావడంతో

కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో చర్యలకు వెనకాడుతున్నారు. దాత అసలు ఇంటి పేరు శ్రీమత్‌ మంత్రరత్నం ప్రతివాద భయంకర అయితే అన్‌ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌లో ఇంటి పేరు శ్రీమత్‌ భయంకర ప్రతివాద అని ఉంది. అసలు దాత తండ్రి పేరే లేదు. దాత 1967 లో ఈ భూమి బహుమతిగా ఇచ్చినట్టు ఇందులో ఉంది. దాత 1967కు ముందే మృతి చెందాడని, అలాంటప్పుడు సంఘానికి ఈ భూమిని ఆయన ఆత్మ రాసిచ్చిందా? అని పలువురు అంటున్నారు. సదరు కమ్మ సేవ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆయనకు ఇంత వరకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేవుడి భూమిని దేవుడికి అప్పగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తాం. కొందరు టీడీపీ నేతలు ఆ భూమిని కబ్జా చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు తమ తప్పులను సరిచేసుకుంటున్నారు. దాత కుటుంబీకులు ఆ భూమి దేవస్థానానికే చెందాలని అధికారులకు తెలిపారు. అయినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టలేదు.

– తానేటి వనిత – మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి

ముదురుతున్న లక్ష్మీపురం ఆలయ భూ వివాదం

కబ్జా భూమిలోనే కల్యాణ మండపం, గుడికి వెళ్లే దారి

చెట్టు నరికి విక్రయించిన సొమ్ము ఏమైంది?

నిగ్గు తేల్చాలంటున్న భక్తులు, స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement