కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు మొబైల్ యాప్‌పై సరైన అవగాహన లేకపోవడంతో యూరియా బుకింగ్ కష్టతరంగా మారింది. యాప్ ఆధారిత బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది రైతులు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో అనుభవం లేకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక పరిజ్ఞానం లోపం వంటి కారణాలతో యూరియా బుకింగ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న వేళ యూరియా అవసరమైన సమయంలో బుకింగ్ సమస్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. యాప్ ద్వారా బుకింగ్ చేయడం తెలియక పలువురు రైతులు ఎరువుల కోసం అటు ఏజెన్సీలు, ఇటు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందక దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యాప్ ఆధారిత విధానానికి బదులుగా పాత పద్ధతిలోనే యూరియాను అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు నేరుగా కేంద్రాలకు వెళ్లి అవసరమైన యూరియాను పొందేలా పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఏజెన్సీ ప్రాంతాల్లో యూరియా సరఫరాను సులభతరం చేయాలని కోరుతున్నారు.
పాత విధానంలో సరఫరా చేయాలని రైతుల డిమాండ్


