ఏలూరు (టూటౌన్): ఎలాంటి షరతులు లేకుండా రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు ఉద్దేశించిన, 2023లో పార్లమెంటులో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టరూపంలో అమలు చేయాలని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ యామిని, జిల్లా అధ్యక్షురాలు వర్కా శ్యామల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద బిల్లు తక్షణం అమలు కోరుతూ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి మన్నవ యామిని, వర్కా శ్యామల మాట్లాడుతూ జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నా పాలకులకు రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికై నా రిజర్వేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా చేసిన సంతకాల ప్రతులను, విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.


