ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కంటే ప్రశ్నిస్తున్న వారిపై అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీఐ) ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.నాగన్న విమర్శించారు. సోమవారం ఏలూరులో జరుగుతున్న జిల్లా సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం కంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రభుత్వం మాటైనా మాట్లాడటం లేదని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రకటించి తల్లికి వందనం, మహిళల ఉచిత బస్సు అంశాలను మాత్రమే అమలు చేసి, ఆడబిడ్డనిధి రూ.1500, నిరుద్యోగ భృతి, వెనుకబడిన తరగతుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ తదితర అనేక అంశాలు అమలు చేయలేదని విమర్శించారు. వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తున్నారన్నారు.


