ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం
● ఓటర్ల ఎన్యూమరేషన్ గడువు పెంచాలి
● కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల విజ్ఞప్తి
● ముసాయిదా జాబితా రూపకల్పనలో లోపిస్తున్న పారదర్శకత!
ఆకివీడు: ఓటర్ల ఎన్యూమరేషన్ కార్యక్రమ గడువును మరింత పెంచాలని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును ఈ నెల 14వ తేదీ వరకే పరిమితం చేయడం వల్ల ఓటర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వంద శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో ఇంకా ఫారాలు అందలేదని ఓటర్లు వాపోతున్నారు. అందిన ఫారాలను కూడా ఏవిధంగా పూర్తి చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి నేతల చేతుల్లోకి ఫారాలు
ఫారాలను పూర్తి చేయించే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొంతమంది నిరక్షరాస్యులైన ఓటర్లు తమ ఫారాలు పూర్తి చేయించుకోవడం కోసం స్థానికుల చుట్టూ తిరుగుతున్నారు. చదువుకున్న వారు సైతం ఫారాలను ఎలా పూర్తి చేయాలో తెలియక తప్పులు దొర్లిస్తున్నారు. దీనివల్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, చాలా గ్రామాలు, వార్డుల్లో బీఎల్‌ఓలు స్వయంగా ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా, కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయిస్తున్నారు. తిరిగి ఆ ఫారాలను మళ్లీ ఆ నాయకులకే ఇవ్వాల్సి వస్తోంది. బీఎల్‌ఓల పరిధిలో ఫారాలు పూర్తి చేయడానికి సమయం సరిపోకపోవడంతో, వాటిని రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టి ఈ నెల 12వ తేదీ లోపు అందజేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ఫారాలు ఏ విధంగా భర్తీ అవుతున్నాయో ఓటర్లకే తెలియడం లేదు. ఈ ప్రక్రియ వల్ల ఫారాలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరుతాయా లేదా అన్న సంశయం నెలకొంది. నిబంధనల ప్రకారం.. బీఎల్‌ఓలే స్వయంగా ఓటరుకు ఫారం అందజేసి, పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఈ గందరగోళం వల్ల చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపులో కూడా నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత వివరాలతో ఓటర్ల తికమక
2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఇతర వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. నాటి ఓటరు సంఖ్యను, గతంలో ఓటు వేసిన సమయంలో ఉన్న ఓటరు సంఖ్యను నమోదు చేయాలన్న సూచనతో ఓటర్లు తికమక పడుతున్నారు. అప్పటి జాబితాలో పేరు లేకపోతే ఈసారి తమకు ఓటు హక్కు లభించదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హడావిడిగా ఓటర్ల జాబితాను తయారు చేయడం వల్ల పారదర్శకత లోపించి పలు అక్రమాలకు తావిచ్చినట్లవుతుందని, గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కొంత మేర తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును పెంచితేనే బీఎల్‌ఓలు సమర్థవంతంగా ఓటర్ల జాబితాను తయారు చేయగలరని కోరుతున్నారు.
ఎన్యూమరేషన్ వివరాలను డిజిటలైజేషన్ పూర్తి చేసి, ఈ నెల 14వ తేదీ లోపు తుది వివరాలను అందజేయాల్సి ఉంది. అనంతరం ఈ నెల 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగనుంది. ఈ ముసాయిదాపై క్లెయిములు, అభ్యంతరాలను ఈ నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు దాఖలు చేసుకోవచ్చు. అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 18వ తేదీ లోపు పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22వ తేదీన అధికారికంగా ప్రచురించనున్నారు.


