సొసైటీ అక్రమాలపై విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సొసైటీ అక్రమాలపై విచారణ చేయాలి

Jul 4 2026 2:13 AM | Updated on Jul 4 2026 2:13 AM

సొసైటీ అక్రమాలపై విచారణ చేయాలి ‘ప్రాజెక్టు మాతృ’ పటిష్టంగా అమలు చేయాలి ఏఎన్‌ఎం వేధింపులతో గుండెపోటు ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ

టి.నరసాపురం: మక్కినవారిగూడెం సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నగదును రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. సొసైటీలో పనిచేస్తున్న ఇద్దరు గుమస్తాలు ఎరువుల విక్రయాల్లో సుమారు రూ.1.44 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజివీడు డీఆర్‌ఓ రవికుమార్‌ విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా సిరిమళ్ళ సాయితేజ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అవినీతిలో సాయితేజ ప్రమేయం లేదని, ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తూ నగదు కట్టించాలని చూడటం వల్లే ఆత్మహత్యకు యత్నించాడని అతని కుటుంబ సభ్యులు సొసైటీ వద్ద ధర్నాకు దిగారు. సొసైటీ చైర్‌పర్సన్‌ సూర్యనారాయణ వివరణ ఇస్తూ.. ఉన్నతాధికారుల పూర్తి విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ‘ప్రాజెక్ట్‌ మాతృ’ పథకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ‘ప్రాజెక్ట్‌ మాతృ’ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణి, బాలింతల ఆరోగ్య పరిరక్షణ ‘ప్రాజెక్ట్‌ మాతృ’పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలో ఎక్కడా ఏ గర్భిణీ, బాలింత కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనతకు గురికాకుండా చూడాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులకు అవసరమైన మందులు వారానికి ఒకసారి అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

జంగారెడ్డిగూడెం: సహచర అధికారిణి వేధింపులు తాళలేక ఓ ఆశా కార్యకర్త గుండెపోటుకు గురైంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పట్టణంలోని హరిజనపేట అర్బన్‌ పీహెచ్‌సీ పరిధిలో బిట్రాల రమాదేవి ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం పద్మ గత కొంతకాలంగా తనను తీవ్రంగా అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తోందని రమాదేవి ఆరోపించారు. గత నెల 30న పల్స్‌ పోలియో చుక్కల మందు క్యారియర్‌ విషయమై ఏఎన్‌ఎం పద్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ వేధింపులపై రమాదేవి మెడికల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, విధులకు హాజరైన తర్వాత సమస్యను సర్దుబాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తన భర్త ఆదినారాయణతో కలిసి ఇంటికి పయనమయ్యారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవికి మార్గమధ్యంలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆమె భర్త వెంటనే స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దెందులూరు: ప్రజా సమస్యలను అధికారులు పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలో ఒక నెల.. ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. 103 సమస్యలపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదులు అందజేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌, పోలవరం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement